Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
గుంటూరులో ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ఇష్టారాజ్యంగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవాబు పత్రాలు దిద్దడానికి వచ్చిన అధ్యాపకులకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా చెట్ల కింద, వరండాల్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మూల్యాంకనం చేస్తున్నారు. మరోవైపు డిగ్రీ విద్యార్థులతో జవాబు పత్రాల బండిళ్ళు మోయిస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు రెండువేల మంది అధ్యాపకులు రెండు షిప్జుల్లో ఇంటర్ జవాబు పత్రాల్ని దిద్దుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన జవాబు పత్రాలు లక్షకుపైగా ఇక్కడికి వచ్చాయి. ఏ సబ్జెక్టు పేపర్లు అయినా రోజుకు 30 మాత్రమే వాల్యూయేషన్ చేయాలి. ఇందుకు విరుద్ధంగా కొంతమందికి 60 పేపర్ల వరకు ఇచ్చి మూల్యాకనం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.