Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల
భూవివాదం మంచిర్యాల జిల్లాలో ఓ హత్యకు కారణమైంది. లక్ష్మీకాంతరావు (63) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పరిధి గద్దెరాగడిలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు బంధువైన లక్ష్మీకాంతరావు తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంచిర్యాల ఆర్పీ రోడ్డులో నివాసముంటున్నారు. గతంలో మద్యం వ్యాపారం చేసిన లక్ష్మీకాంతరావు.. గద్దెరాగడి సమీపంలో భూమి కొనుగోలుకు సంబంధించి విక్రయదారునికి బయానాగా కొంత సొమ్ము చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదని సమాచారం. ఈ విషయంలో వారిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా.. విక్రయదారుడు సదరు స్థలాన్ని మరొకరికి విక్రయించారు. అయితే, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతున్నదని తెలుసుకున్న లక్ష్మీకాంతరావు సోమవారం సాయంత్రం ఆ పనులను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా మంగళవారం మాట్లాడుకుందామని వెళ్లిపోయారు. వివాదాస్పద స్థలం వద్ద మంగళవారం ఉదయం కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా.. అక్కడ ఉన్న కొందరు లక్ష్మీకాంతరావుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. లక్ష్మీకాంతరావు కుటుంబసభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని, అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.