Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భద్రతా బలగాలు డ్రోన్‌ను కూల్చివేశాయి. బుధవారం రాత్రి రాజౌరీ జిల్లాలోని బేరీపఠన్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అనుమానాస్పద వస్తువు కదలికను జవాన్లు గుర్తించారు. దీంతో గాలింపు చేపట్టగా ఓ డ్రోన్ ఎగరడాన్ని గమనించిన సైనికులు దానిపై కాల్పులు జరిపారు. అది కూలిపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. దానికి ఉన్న ప్యాకెట్లను తీసి చూడగా.. రూ.2 లక్షల నగదు, ఏకే 47 తుపాకికి చెందిన 131 రౌండ్ల 5 మ్యాగజైన్లు పలు వస్తువులు లభించాయి. దీంతో ప్రాంతంలో సైన్యం గాలింపు ముమ్మరం చేసింది. ఆ కన్సైన్మెంటు ఎవరికోసం తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 28న కూడా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారత సరిహద్దుల్లోకి వస్తున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. డ్రోన్‌తోపాటు 1.2 కిలోల హెరాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో పాకి భూభాగం నుంచి అక్రమంగా డ్రోన్లు ప్రవేశించడం సర్వసాధారణమైపోయింది.