Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కుమారుడు పుట్టుకతోనే మూత్రపిండాల ఆ వ్యాధి నుంచి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు తల్లిదండ్రులు. ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో ఆ తల్లే మరోసారి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కుమారుడికి కిడ్నీ దానం చేసి మళ్లీ జీవం పోసింది.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈ పేద దంపతులు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వీరికి జన్మించిన బాలుడు పుట్టుకతోనే బైలాటరల్ వెసికోయూరెటిరిక్ రిఫ్లక్స్ అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఎడమ వైపు కిడ్నీ కూడా ఫెయిలైంది. దీంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రులను సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్‌లో తమ 12 ఏండ్ల కుమారుడిని చేర్పించారు. ఈ క్రమంలో దఫదఫాలుగా బాలుడికి చికిత్సలు నిర్వహించారు నిమ్స్ వైద్యులు. ఎడమ వైపు కిడ్నీని తొలగించారు. రెండో దశలో తల్లి దానం చేసిన కిడ్నీని కుమారుడికి విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ తరుణంలో యూరాలజీ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేయడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద బాలుడికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని, మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని తెలిపారు.