Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: వాటర్ సంప్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు సోదరులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నగరంలోని షేక్‌పేట, పారామౌంట్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. ఎండి అనస్(19), ఎండి రిజ్వాన్(18), రజాక్(16) ముగ్గురు అన్న దమ్ములు. రంజాన్ కావడంతో ఇంట్లోని సంప్‌ను క్లీన్ చేసేందుకు సంప్‌లోకి దిగారు. సంప్ క్లీన్ చేసిన తర్వాత అనస్ మోటార్‌ను ఆఫ్ చేసేందుకు స్విచ్ ఆఫ్ చేసే క్రమంలో కరెంట్ షాక్ వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు అన్నను కాపాడేందుకు వెళ్లి విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు కుమారులు రంజాన్ మాసంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.