Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్- విజయవాడ మార్గంలో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయించింది. ఈ మార్గంలో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈనెల 30 వరకు 10శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుందని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటనలో వివరించారు.
ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీసులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. టికెట్లో విజయవాడ వరకు 10శాతం రాయితీ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.comను సంప్రదించాలని సూచించారు.