Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కర్ణాటకలో అసంతృప్తి నేతలు ఇతర పార్టీలవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి.. ఇటీవల బీజేపీను వీడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడిగా మారేందుకు లక్ష్మణ్ స్వయంగా ముందుకొచ్చారు. బీజేపీలో తనకు అవమానం జరిగినట్లు ఆయన భావిస్తున్నారు. ఇలాంటి గొప్ప నాయకులను పార్టీలోకి తీసుకోవడం మా కర్తవ్యం. 9- 10 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలూ మాతో చేరాలనుకుంటున్నారు. కానీ, సీట్లు కేటాయించే పరిస్థితి లేదు' అని డీకేఎస్ వ్యాఖ్యానించారు.
లక్ష్మణ్ శుక్రవారం ఉదయం బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకేఎస్, పార్టీ అధికార ప్రతినిధి, కర్ణాటక ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సూర్జేవాలాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన ముందుకొచ్చినట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణ్.. తన పదవికి రాజీనామా చేసేందుకుగానూ నేడు శాసనమండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టిని కలుస్తారని, ఆపై అధికారికంగా కాంగ్రెస్‌లో చేరతారని శివకుమార్ చెప్పారు.