Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా 11 వేల పైచిలుకు కేసులు బయటపడ్డాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతానికి ఎగబాకింది. ఇక ఏడురోజుల సగటు పాజిటివిటీ రేటు 4.29 శాతానికి చేరుకుంది. కొత్తగా 29 కరోనా మరణాలు సంభవించాయి. ఈ లెక్కలు చూసి అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి కరోనా పరిస్థితులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నారు. అయితే.. అకస్మాత్తుగా కరోనా కేసుల పెరుగుదలకు కారణమేమిటనేది అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న.
ఇటీవల కేసుల పెరుగుదల వెనుక పలు కారణాలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) పేర్కొంది. కొవిడ్ నిబంధనల సడలింపు, కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గింపు, ఉనికిలోకి వచ్చిన కొత్త కరోనా ఉపవేరియంట్ వెరసి కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని ఐఎమ్ఏ చెబుతోంది. అంతేకాకుండా, దేశంలో విస్తృతస్థాయిలో టీకాకరణ జరగడంతో ప్రజల్లో కరోనా పోయిందన్న నమ్మకం పెరిగి జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిపోయిందని కూడా ఐఎమ్ఏ పేర్కొంది.
ఒమెక్రాన్ ఉపవేరియంట్ అయిన ఎక్స్‌బీబీ.1.16 కారణంగానే ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ పేర్కొంది. అయితే, ఈ వైరస్ ప్రాణాంతకమైనది కాదని, ఇది ఎప్పటినుంచో ప్రజల మధ్య ఉందని నిపుణులు చెబుతున్నారు.