Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. 94 గజాల స్థలం కోసం సొంత తమ్ముడికి ఇవ్వడం ఇష్టం లేని అన్నా తమ్ముడి పైన పెట్రోల్ పోసి అంటించి ఆ తరువాత తల పైనా బండ రాయితో చంపిన ఘటన వరంగల్ లో తీవ్ర సంచలనంగా మారింది. వరంగల్ పట్టణం ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. అందరికీ వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన స్థలాన్ని ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. అయితే అందరిలో పెద్దవాడైన శ్రీనివాస్ చనిపోవడంతో మిగిలిన ఇద్దరు స్థలం కోసం గొడవ పడేవారు. దీంతో చిన్న శ్రీకాంత్ తన వాటాగా వచ్చిన 94 గజాల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా శ్రీధర్ అభ్యంతరం తెలిపాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో శ్రీధర్ స్థలం దగ్గరకు వచ్చి సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ నిజామాబాద్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామం వరంగల్ చేరుకున్నాడు. తన భూమిని అమ్మేందుకు మరోసారి ప్రయత్నించగా శ్రీధర్ సోదరుడు మరోసారి బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక శ్రీకాంత్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరుడిపై శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తమ్ముడి స్థలం విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో శ్రీకాంత్ తన భూమిని విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో శనివారం తన స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారిని వెంబడించాడు. స్థలం చూపిస్తుండగా శ్రీధర్ ఒక్కసారిగా సోదరుడిపై దాడి చేశాడు. శ్రీకాంత్‌ను తీవ్రంగా కొట్టి ఇంట్లోకి లాక్కెళ్లిన శ్రీధర్ ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తమ్ముడిని ఇంట్లోనే ఉంచి బయటి నుంచి తలుపులు వేసి రాయిని అడ్డుకున్నాడు. కానీ శ్రీకాంత్ శరీరం మొత్తం నిప్పంటుకోవడంతో తలుపు తోసి రోడ్డుపైకి వచ్చాడు. అయినా శ్రీధర్ వదల్లేదు. అందరూ చూస్తుండగానే రాయితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య, పిల్లలను తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.