Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ.. టికెట్ల పంపిణీ అగ్గిరాజేసింది. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారంతా రాజీనామాల బాటపట్టారు. ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసిన కమలనాథులు.. దాదాపు 60మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఉత్తర కన్నడలోని శిరసి పట్టణానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న జగదీశ్ షెట్టర్.. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి తన రాజీనామా పత్రాన్ని అందింతారు.
వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ నుంచి పోటీచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్‌కు బీజేపీ ఈసారి అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ఎంతో సేవ చేసిన తనను కరివేపాకులా తీసిపాడేశారంటూ పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను కోల్పోవాల్సి వస్తుందని పార్టీ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. కేంద్ర నాయకత్వంపై విశ్వాసం ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర నేతలే పార్టీ నుంచి నెట్టేశారని ఆరోపించారు. అయినప్పటికీ అధిష్ఠానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడం వల్ల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.