Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్’ (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలేశ్ కుమార్ శర్మ, టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణపై ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. డిజిటల్ ఎకానమీని మరింత విస్తృతం చేయడంతోపాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుచడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు చెప్పారు. ఈ విషయాలపై సభ్యదేశాల అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖల సహాయ మంత్రి నారాయణ స్వామి పాల్గొంటారని చెప్పారు. నాలుగు రోజుల చర్చలో కొత్తగా వస్తున్న డిజిటల్, టెలికాం టెక్నాలజీలు, సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళిత వృద్ధి సాధించడంపై అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలు పంచుకోనున్నట్టు పేర్కొన్నారు. జీ-20 ప్రతినిధులు హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఐఐటీ)ని సందర్శిస్తారని చెప్పారు. 18న వర్‌షాప్ జరుగుతుందని అన్నారు. జీ-20లో తొలిసారిగా ఈ ఏడాది ‘డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్’ కార్యక్రమం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఇందులో పోటీపడవచ్చని వివరించారు. ఇప్పటివరకు 1600కు పైగా స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకున్నాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.