Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిర్మల్
తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నిన్న భానుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. జిల్లాలోని దస్తూరాబాద్ మండలంలో ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. ఎండ దెబ్బకు జనం బయటకు వచ్చేందుకు భయపడ్డారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఈ-తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూరాబాద్‌లో44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని 14 జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.