Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముంబాయి: సచిన్ టెండుల్కర్ తన బ్యాటుతో మరిచిపోని ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేసి దీర్ఘకాలం పాటు కెరీర్ లో కొనసాగిన సచిన్ భారతరత్న పురస్కారం సైతం అందుకున్నాడు. అంతటి పేరున్న క్రికెటర్ కు వారసుడిగా అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ తరుణంలో అభిమానులు అర్జున్ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ముంబై తరఫున ఆదివారం మొదటి మ్యాచ్ ఆడాడు. రెండు ఓవర్లు వేయగా, ఒక్క వికెట్ తీయలేదు. కాకపోతే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో మాత్రం 12 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ తర్వాత తన కుమారుడి ప్రదర్శనను అభినందిస్తూ సచిన్ ట్వీట్లు చేశారు. అర్జున్ సోదరి సరా కూడా ఎమోజీలతో స్పందించింది.
‘‘అర్జున్ క్రికెటర్ గా ఈ రోజు నీవు మరో కీలక అడుగు ముందుకు వేశావు. నీ తండ్రిగా, నిన్ను ప్రేమించే వాడిగా, క్రికెట్ ను ఎంతో ఇష్టపడేవాడిగా, నీవు ఆటకు గౌరవాన్ని తీసుకువస్తావని, అదే ఆట తిరిగి నిన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు. ఇక్కడకు చేరుకోవడానికి నీవు ఎంతో కష్టపడ్డావు. దీన్ని కొనసాగిస్తావని నేను నమ్మకంగా చెప్పగలను. అందమైన ప్రయాణానికి ఇది ఆరంభమే. నీకు అంతా మంచే జరగాలి’’అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు.