Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి, తెలంగాణ అత్యధిక అవార్డులు గెలుచుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం తమ వంతు కృషి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు అందుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామపంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో 46 మాత్రమే ఎంపిక కాగా.. అందులో 13 తెలంగాణకే వచ్చాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.