Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం వైజాగ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1941 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో జన్మించారు. చిన్నతనం నుంచి బాలికి చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. ఇంటి ముందు వాళ్ల అక్క వేసే ముగ్గులను చూసి డ్రాయింగ్స్ వేయడం మొదలుపెట్టారు.
అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా చేరారు. కానీ చిత్రలేఖనంపై మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1970ల్లో అప్‌కమింగ్ ఆర్టిస్టుల కోసం ఆంధ్రపత్రిక నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు బహుమతి గెలుచుకున్నారు. 1974లో ఈనాడు న్యూస్ పేపర్లో విశాఖపట్నం ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా చేరిన తర్వాత ఆయన కెరీర్ ఊపందుకుంది. ఆయనలోని ప్రతిభను చూసిన అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ మేడిశెట్టి శంకరరావు పేరును బాలిగా మార్చారు.