Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చిత్తూరులో అనుమానాస్పద స్థితిలో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతి మృతి చెందింది. పక్కనే రక్తపు మడుగులో ప్రాణాలతో యువకుడూ పడి ఉండటం సంచలనంగా మారింది. యువతిని అతనే హతమార్చి తానూ ఆత్మహత్యకు యత్నించాడా లేక ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేశారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని కొండమిట్టలో దుర్గా ప్రశాంతి (23) బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. యువతి తండ్రి నాగరాజు స్థానిక తాలుకా పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన చక్రవర్తి (31) అనే యువకుడు చిత్తూరులోని దర్గాకూడలిలో తల్లి ప్రమీల, స్నేహితుడు శశికుమార్‌తో కలిసి మూడు నెలలుగా దుకాణం నిర్వహిస్తున్నారు. ప్రశాంతి, చక్రవర్తికి దాదాపు రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చక్రవర్తి చిత్తూరుకు మకాం మార్చాడు. మంగళవారం మధ్యాహ్నం చక్రవర్తి.. బ్యూటీపార్లర్ వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి అలికిడి రాకపోవడంతో స్థానికులు గమనించి పార్లర్ లోపలకు వెళ్లగా యువతీ, యువకుడు రక్తపు మడుగులో కనిపించారు. యువతి మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడం, చక్రవర్తి గొంతు, చేతులకు కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని తొలుత జిల్లా ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. యువతిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలలో ఉంచారు.