Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్రీడా రంగంలోనూ తెలంగాణ సత్తా చాటేలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల జిల్లా యువజన సర్వీసుల శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ తరుణంలో వారితో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్లో దేశంలో జరిగే అన్ని క్రీడాంశాలలో తెలంగాణ క్రీడాకారులు ఇతర రాష్ట్రాల క్రీడాకారుల కంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పతకాలు సాధించడంలో ముందుండాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని లక్ష్యంతో మండలం, జిల్లా , రాష్ట్రస్థాయిలో సీఎం కప్ నిర్వహించనున్నామని తెలిపారు. త్వరలో సీఎం కప్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తామన్నారు. సీఎం కప్పు నిర్వహణపై త్వరలో ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ , రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, దీపక్, చంద్రారెడ్డి, డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.