Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలుగు సాహిత్య వికాసానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) సీఎండీ మోటుపల్లి ప్రసన్నకుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా కవి, రచయిత కావడంతో తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. బుధవారం ఇక్కడ ఎన్ఎల్సీ కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రసన్నకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాహిత్య వికాసం గురించి ముచ్చటించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎన్ఎల్సీ నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నైవేలీలో దక్షిణాది భాషల సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. నైవేలీ అన్నది మినీ ఇండియా అని, బహుభాషాజనుల సంగమమని చెప్పారు. జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు బహుభాషా సమ్మేళనం గురించి తెలియజేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.