Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటిపోయింది. దేశంలో కొత్తగా 12,591 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. నిన్నటి కంటే 20 శాతం కేసులు అధికంగా నమోదైనట్లు పేర్కొంది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.16 బాధితులే ఎక్కుగా ఉన్నట్లు పేర్కొంది. కేసులు పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన కేంద్రం అర్హులైన వారంతా వీలైనంత తొందరగా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొదటి, రెండో డోసులు కలిపి 220.66 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.67శాతంగా ఉందన్న కేంద్రం.. గడిచిన 24 గంటల్లో 10,827 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు 92.48 కోట్ల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 2,30,419 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రి చేరికలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్ కట్టడి చర్యలతో పాటు పౌరులు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. మరోవైపు వచ్చే రెండు వారాల్లో ఢిల్లీలో కొవిడ్ కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నిపుణులు సురేశ్ కుమార్ అంచనా వేశారు.