Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
కరీంనగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. అయితే, మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తప్పించుకోగా.. ఆయన కూతురు వైష్ణవికి గాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకునేందుకు అరుణ్ ఇంట్లో నుంచి పరుగులు తీశాడు. దుండగులు వెంటాడడంతో అరుణ్ ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. దుండగులు కూడా చొరబడి ఆ ఇంట్లో వారిపై దాడి చేశారు. గొడవతో సంబంధంలేకున్నా అరుణ్ తలదాచుకున్న ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఆయుధాలతో ఇంట్లో వారిని బెదిరిస్తూ సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ గొడవ గురించి స్థానికులు సమాచారం అందించడంతో మానకొండూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగులు నలుగురు పారిపోయారు. వెంటాడిన పోలీసులు ఇద్దరిని పట్టుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో మానకొండూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.