Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాపిల్ భారత్‌లో రెండో అధీకృత విక్రయశాలను గురువారం ప్రారంభించింది. సీఈఓ టిమ్ కుక్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేడ్రే బ్రియాన్‌తో కలిసి వినియోగదార్లకు స్వాగతం తెలిపారు. ముంబయిలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ బీకేసీ పేరిట తొలి స్టోర్‌ను ఏప్రిల్ 18న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ స్టోర్‌ను యాపిల్ సాకేత్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేశారు. యాపిల్ బీకేసీతో పోలిస్తే ఢిల్లీలోని స్టోర్ విస్తీర్ణంలో సగం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
స్టోర్ల ప్రారంభం నిమిత్తం ఏప్రిల్ 17నే భారత్‌కు చేరుకున్న టిమ్ కుక్ మంగళవారం యాపిల్ బీకేసీని ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్ తెలిపారు. దేశంలోని తమ కాంట్రాక్టు తయారీదార్ల వద్ద ఉద్యోగుల సంఖ్యను పెంచి 2 లక్షలకు చేర్చాలని యాపిల్ నిర్ణయించినట్లు సమాచారం. తమ విడిభాగాల తయారీ సంస్థలను భారత్‌లో విస్తరించేందుకు ప్రభుత్వ మద్దతును టిమ్ కుక్ కోరినట్లు సమాచారం.