Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తండ్రి రెండేళ్ల కుమారుడిపై కక్షగట్టాడు. చాక్లెట్ ఆశ చూపించి ఆ చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశాడు.
ధారావిలో నివసిస్తున్న నిందితుడు(22) ఓ దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలంటే అతడి భార్య, కుమారుడి అడ్డు తొలగించాలని నిందితుడికి ఆమె షరతు విధించింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం భార్య, కుమారుడిని హత్యచేయడానికి ప్రణాళిక రచించాడు. చాక్లెట్ కొనిస్తానని చెప్పి భార్య నుంచి పిల్లాడిని తీసుకుని బయటికి వెళ్లాడు. అనంతరం ఆ బాలుడిని తమ కుటుంబానికి చెందిన దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం రాత్రి వేళ మృతదేహాన్ని మీఠీ నదిలో పడేశాడు. బాలుడు కనిపించకపోవడంతో బంధువులు బుధవారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ప్లాస్టిక్ బ్యాగుతో కప్పి ఉందని తల, చేయి భాగాన్ని ఎలుకలు కొరికేసాయని పోలీసులు తెలిపారు. ఈ విచారణలో బాలుడి తండ్రే హంతకుడని గుర్తించి అతడిని అరెస్టు చేశారు.