Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మానకొండూర్‌లో అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గన్ మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ దాడిలో అరుణ్ కూతురు వైష్ణవి గాయపడింది. దుండగుల నుంచి తప్పించుకున్న అరుణ్ సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. అయినా దుండగులు అతడిని వదల్లేదు. అరుణ్ దాక్కున్న ఇంట్లోకి వెళ్లి ఇంటి సభ్యులను చితకబాదారు. వారి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు.
ఈ తరుణంలో భయభ్రాంతులకు గురైనా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు మానకొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలజడి సృష్టిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష్, మానకొండూరు మండలం కెల్లెడకు చెందిన బైరగోని మధుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు అరుణ్‌కు కూడా నేర చరిత్ర ఉందని బాధితురాలు తెలిపింది. పాత సంబంధాల కారణంగానే కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.