Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుల్లో కొందరు ఇటీవల గల్లంతు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దర్ని రక్షించగా.. తాజాగా అనురాగ్ మలు కూడా సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించాక కిందికి దిగుతున్న సమయంలో ఆయన గల్లంతయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అనురాగ్ సోదరుడు సుధీర్ వెల్లడించారు.
ప్రపంచంలో ఎత్తైన పర్వతాల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించేందుకు రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మలు గతవారం బయలుదేరారు. పర్వతాన్ని అధిరోహించాక కిందికి దిగే క్రమంలో 6000 మీటర్ల ఎత్తులో ఉండగా కిందకు పడిపోయారు. ఏప్రిల్ 17న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. తాజాగా ఆయన ప్రాణాలతోనే ఉన్నట్లు కనుగొని కాపాడారు. అయితే, 8 వేల మీటర్ల ఎత్తున్న మొత్తం 14 పర్వతాలను అధిరోహించాలని అనురాగ్ మలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఏడు పర్వతాలు ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైనవి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ మిషన్ చేపట్టారు. వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే కర్మవీర్ చక్ర అవార్డును కూడా అనురాగ్ మలు గతంలో అందుకున్నారు.