Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పంజాగుట్ట
టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్ తాళాలు పగలగొట్టి 129 తులాల బంగారు, వజ్రాభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్, శ్రీనగర్‌కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సుమిత్ర వ్యక్తిగత పని మీద ఈ నెల 17న ఢిల్లీ వెళ్లారు. ఊరికి వెళ్లే ముందు తన ఫ్లాట్ తాళాన్ని అదే అపార్ట్మెంట్లో నివాసముంటున్న భువనేశ్వరి అనే సమీప బంధువుకి ఇచ్చారు. అయితే, 18వ తేదీ ఉదయం ఆ ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండటాన్ని గమనించిన భువనేశ్వరి వెంటనే సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆపై, విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగొచ్చిన సుమిత్ర.. తన పడక గదిలోని ఇనుప బీరువాలో భద్రపరిచిన నగలు, వెండి వస్తువులు మాయమైనట్టు గుర్తించారు. మొత్తం 129 తులాల బంగారు, వజ్రాభరణాలు, సుమారు 293 గ్రాముల వెండి సామగ్రి దొంగతనానికి గురి అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.