Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత పాకిస్థాన్ నాయకుడు అధికారిక పర్యటన నిమిత్తం భారత్ కు వస్తున్నారు. పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. మే 4-5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశీ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్ ఆహ్వానం మేరకు భుట్టో పర్యటన ఖరారైందని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం ప్రకటించింది. అన్ని దేశాల మాదిరిగానే పాక్ మంత్రికీ ఆహ్వానం పంపినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
చివరిసారిగా 2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారత్ లో పర్యటించారు. 2019 తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బిలావల్ భుట్టో భారత్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు భుట్టో పర్యటన ఖరారైన రోజే జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద భారత ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు.