Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అహ్మదాబాద్: దంపతులు గిలెటిన్ వంటి పరికరంతో తమ తలలు నరుక్కుని తమకు తాముగా నరబలి ఇచ్చుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వింఛియా గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ పొలంలో అనుమానాస్పదంగా మరణించారు. 38 ఏళ్ల హేముభాయ్ మక్వానా, భార్య అయిన 35 ఏళ్ల హన్సాబెన్ తమకు తాము నరబలి ఇచ్చుకోవాలని నిర్ణయించారు. దీనికి ముందు హోమం ఏర్పాటు చేశారు. దాని ముందు తలలు నరికే గిలెటిన్ వంటి పరికరాన్ని ఏర్పాటు చేశారు. మొండం నుంచి తలలు తెగిన తర్వాత ఆ హోమంలో అవి పడేలా ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సొంతంగా తయారు చేసుకున్న మరణశిక్షకు వినియోగించే గిలెటిన్ వంటి పరికరం ద్వారా తమ తలలు నరుక్కుని నరబలికి పాల్పడ్డారు. కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా మరణించిన దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ తల్లిదండ్రులు, పిల్లలను బంధువులు జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ భార్యాభర్తలు గత ఏడాదిగా పొలం వద్ద ఉన్న గుడిసెలో ఏవో పూజలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.