Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తనపై నమోదైన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కొట్టివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజకీయ దురుద్దేశాలతో కావాలనే తనపై ఈ కేసు పెట్టారని సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు ఈ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తులో కీలకమైన మొబైల్‌ను ఇవ్వట్లేదని తెలిపారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి మార్చి 1 నుంచే కుట్ర జరిగిందని ఏజీ న్యాయస్థానానికి వెల్లడించారు.
ఈ తరుణంలో ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. గుజరాత్ సహా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయని ప్రశ్నించింది. గతంలో ఒకట్రెండు రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు జరిగేవని వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న సంజయ్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. సంజయ్ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి, హెడ్మాస్టర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.