Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబంలో ఇటీవలే మరణించిన వృద్ధురాలి అస్తికలను గోదావరిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని బెజ్గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు బస్సులో బయల్దేరారు. అయితే కొత్తపేట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి, ప్రయివేటు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 25 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోవడంతో జేసీబీ సహాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి కొత్తపేటలోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ రోడ్డుప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.