Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యుదాఘాతం మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో విషాదం నింపింది. పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన బొల్లం పల్లి శ్రీనివాసాచారి (45) పట్టణంలో బంగారు నగల వ్యాపారంతో పాటు లైన్ గడ్డలోని తన నివాస ప్రాంతంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. చెన్నూర్ విశ్వకర్మ వర్తక సంఘం అధ్యక్షుడిగా ఇటీవలే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గురువారం రాత్రి ఈదురుగాలులతో వర్షం వల్ల ఇంటి ముందు చెత్త,చెదారం నిలిచింది. శుక్రవారం ఉదయం అతడి భార్య శశిదేవి (38) నీటి పైప్‌తో శుభ్రం చేస్తూ కింద పడిన బనియన్‌ను తీసి పక్కనే ఉన్న ఇనుప తీగ (జీఐ వైర్)పై వేసింది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురై కేకలు వేస్తూ కిందపడిపోయింది. ఆమెను కాపాడేందుకు శ్రీనివాస్ చేయి పట్టుకోగా ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. శశిదేవి తండ్రి కట్టా ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసు దేవరావ్ తెలిపారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్థానిక ప్రభుత్వ దవాఖానలో బాధిత కుటుంబీకులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.