Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అభం శుభం తెలియని చిన్నారిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. మంచంపై నిద్రిస్తున్న బిడ్డ గొంతుపట్టి టేకు తోటలోకి ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస కూడలి సమీపంలోని సీతామహాలక్ష్మి జూట్‌మిల్లు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెట్టవలస గ్రామానికి చెందిన పైల రాంబాబు, రామలక్ష్మి దంపతులు గుంటూరు మిర్చి యార్డులో కూలీలుగా పని చేసేవారు. మూడు నెలల కిందట సొంతూరికి చేరుకుని ఒక పాకలో అల్పాహార దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. వారికి కుసుమ (3), సాత్విక (16 నెలలు) సంతానం. శుక్రవారం సాయంత్రం పాకలో నిద్రిస్తున్న చిన్న కుమార్తెను కుక్కలు గొంతుపట్టి సమీపంలోని టేకు తోటలోకి ఈడ్చుకెళ్లాయి. అల్పాహార దుకాణానికి కొద్దిదూరంలో గిన్నెలు తోముకుని అక్కడికి వచ్చిన రామలక్ష్మికి సాత్విక కనిపించలేదు. కంగారుపడి 'చెల్లి ఏదమ్మా'? అని కుసుమను అడగ్గా.. కుక్కలు టేకుతోటలోకి లాక్కెళ్లాయని ఏడుస్తూ చెప్పింది. స్థానికుల సాయంతో 15 నుంచి 20 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో వెతకగా ఆరు కుక్కలు పాపను చుట్టుముట్టి ఉండటంతో రాళ్లు, కర్రలతో వాటిని తరిమికొట్టారు. కుక్కల కాట్లకు రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కొనఊపిరితో ఉన్న బిడ్డను రాంబాబు ద్విచక్రవాహనంపై విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే ఆ చిన్నారి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.