Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో వైరల్ అవుతున్న వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 300 మందికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశానని చెప్పాడు. నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్రాజ్ (34) స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిత్యం తిరిగేవాడు. అక్కడి మార్చురీలో పనిచేస్తున్న వ్యక్తి చెప్పే పనులు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న అతడు మాట్లాడిన ఓ వీడియో బయటకు వచ్చి కలకలం రేపింది.
అందులో అతడు మాట్లాడుతూ.. తాను దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్టు పేర్కొన్నాడు. అయితే, తాను ఈ హత్యలు తనంత తానుగా చేయలేదని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వయోవృద్ధులు, ఆరోగ్యం క్షీణించి బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్టు చెప్పాడు. ఇందుకోసం ఒక్కో దానికి రూ. 5 వేలు చొప్పున తీసుకున్నట్టు పేర్కొన్నాడు. ఇలా ఇంజెక్షన్లు ఇచ్చి ఇప్పటి వరకు 300 మందిని చంపేసినట్టు మోహన్రాజ్ తెలిపాడు. ఇలాంటి పనుల కోసమే చెన్నై, బెంగళూరు కూడా వెళ్లానని చెప్పుకొచ్చాడు. తనకు రూ. 5 వేలు ఇస్తే రెండంటే రెండే నిమిషాల్లో పని పూర్తి చేస్తానని కూడా మోహన్రాజ్ ఆ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతడు చెప్పింది మరోలా ఉంది. తాను మద్యం మత్తులో అలా మాట్లాడినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.