Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గత రెండు దశాబ్దాలుగా 12- తుగ్లక్ లేన్ బంగ్లాలో ఉంటున్న రాహుల్ ఇటీవల తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు తరలించారు. ఈ తరుణంలోనే ఈ మధ్యాహ్నం సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ తన నివాసానికి వెళ్లారు. మిగతా వస్తువులను తీసుకుని బంగ్లా తాళాలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇకపై రాహుల్ తన తల్లితో కలిసి జన్‌పథ్‌లో ఉండనున్నారు.
రాహుల్ అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన క్రమంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. #MeraGharAapkaGhar (నా నివాసమే మీ నివాసం) అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ‘‘ఈ దేశమే రాహుల్ గాంధీకి ఇల్లు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆయనకు ప్రజలతో ఉన్న అనుబంధం విడదీయరానిది. కొందరు ఆయనలో కుమారుడిని చూసుకుంటారు. మరికొందరు అన్నలా భావిస్తారు. రాహుల్ ప్రతి ఇంటి మనిషి. ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబసభ్యులే. అందుకే ఇప్పుడు యావత్ దేశం ‘రాహుల్ జీ, నా ఇల్లే మీ ఇల్లు’ అని అంటోంది’’ అని కాంగ్రెస్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చింది.