Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నర్సాపూర్
ప్రయాణికురాలి నుంచి పుస్తెలు తాడును దొంగలించిన ఆటో డ్రైవర్ను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా తాళ్ళపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఊరడి సురేశ్ అతని భార్య స్వప్నతో కలిసి ఆటోలో సంగారెడ్డి నుంచి నర్సాపూర్ బయలు దేరారు. ఇస్మాయిల్ఖాన్పేట్కు చెందిన అమృత అనే మహిళ మార్గమధ్యలో ఆటోలో ఎక్కింది.
ఆటో ఆవంచ గ్రామ సమీపంలోకి రాగానే డ్రైవర్ ఊరడి సురేశ్ ఆటోను రోడ్డు పక్కకు నిలిపి ప్రయాణికురాలు అమృతకు కత్తి చూపించి బెదిరించి పుస్తెలు తాడును లాక్కొన్నాడు. బాధితురాలు చేసేది లేక రోడ్డుపై బిగ్గరగా ఎడవడం ప్రారంభించింది. అయితే ఈ తరుణంలో ఆ మార్గంలో వస్తున్న రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి అమృత రోదనలు చూసి కాన్వాయి ఆపి విషయం తెలుసుకుంది. ఆటో డ్రైవర్ను వెంటనే పట్టుకోవాలని ఆమె తన వెంట ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ఆటో డ్రైవర్ను వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. దొంగిలించిన పుస్తెలతాడును డ్రైవర్ వద్ద నుంచి తీసుకుని బాధితురాలికి అప్పగించారు.