Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. సమ్మెకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్-82)తోపాటు మరో సంఘం మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఐడీ నంబర్ కలిగిన కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎ్‌సఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆర్టిజన్ల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి, వారికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని టీఈఈ-1104 యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి సమ్మె చేపట్టాలని కొన్ని సంఘాలు నిర్ణయించడాన్ని 1104 యూనియన్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. యూనియన్‌లో సభ్యత్వం పొందిన ఉద్యోగులు, ఆర్టిజన్లు సమ్మెకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్టిజన్ కార్మికులు ఏకపక్షంగా సమ్మెకు దిగడం సరికాదని, ఏపీఎ్‌సఈబీ రూల్స్‌ను వర్తింపజేయాలనడం అసమంజసమని బీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ అన్నారు. సమ్మెతో తమకు సంబంధం లేదని టీఎ్సఈఈఈ యూనియన్ -327 సెక్రటరీ జనరల్ శ్రీధర్ తెలిపారు.