Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25 కోట్లకు అమ్ముడుపోయిన రేవంత్ అని గతంలోనే చెప్పా..
- ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ-వీణవంక
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇద్దరూ తోడు దొంగలేనని, తాను రెండు సంవత్సరాల క్రితమే చెప్పానని, అది ఇప్పుడు నిరూపితమైందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తనకు టికెట్ రాకుండా ఈటల అడ్డుకున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారని, ఈ విషయంపై తాను రెండేళ్ల క్రితమే వారి బాండారం బయట పెట్టానని వివరించారు. ఉప ఎన్నికలల్లో వారి చీకటి ఒప్పందం మేరకే జరిగాయని, కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మరో సారి నిరూపితమైందని మండిపడ్డారు. వారి లెక్కల్లో తేడా రావడం వల్లే ఒకరికొకరు విమర్శించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రమాణాల పేరిట నాటకాలు ఆడుతున్నారన్నారు. రానున్న ఎన్నికలల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈటల రోజురోజుకు సహనం కోల్పోతున్నారని, అందుకే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని, సీఎం కేసీఆర్ సంస్కారం నేర్పే వ్యక్తని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, చెకబండి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.