Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , బిర్యానీ సెంటర్లు కిరాణా షాపులే టార్గెట్ గా బిజినెస్
- పేరుకే నాణ్యతా ప్రమాణాలు , ఆచరణలో మాత్రం శూన్యం
- వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆక్వాఫిన కంపనీ వాటర్ బాటిల్స్
- ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్ననిర్వాహకులపై అధికారులు పట్టించుకోని వైనం
- జిల్లాలో ఆక్వాఫిన కంపనీ వాటర్ బాటిల్స్ పై పెరుగుతున్న ఫిర్యాదులు
- అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన
నవతెలంగాణ ప్రత్యేక కథనం
దుబ్బాక రూరల్
బ్రాండెడ్ కంపనీల పేరుతో మార్కెట్ లోకి ఆక్వాఫిన కంపనీ వాటర్ బాటిల్ చెలామణి అవుతున్నాయి . ఈ కంపనీ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , బిర్యానీ సెంటర్లు కిరాణా షాపులే టార్గెట్ గా బిజినెస్ చేస్తున్నాయి . నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం అని మన పెద్దలు చెప్పిన మాటను క్యాష్ చేసుకుని ఈ కంపనీ జోరుగా దందా సాగుతూ .. ధనర్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కలుషిత నీరును వాటర్ బాటిల్లో రవాణా చేస్తూ... ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.ఇక పేరుకే నాణ్యతా ప్రమాణాలు , ఆచరణలో మాత్రం శూన్యం అంటూ వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఆక్వాఫిన కంపనీ పై చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని అటు వినియోగదారులు ,ఇటు ప్రజలు కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇలాంటి నిర్వాహకులపై గతంలో అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఆరోగ్య, ఆర్థిక మంత్రి హరీష్ రావ్ ప్రతినిత్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకొక పోవడం గమనార్హం . ఇకనైనా సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆక్వాఫిన లాంటి కంపెనీలను సీజ్ చేసి... వారీ ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేసి బాధితులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి మరీ ..
ఉమ్మడి మెదక్ జిల్లాలో బ్రాండెడ్ కంపనీల పేరిట వ్యాపారం ...
పంచభూతాల్లో ప్రాణా ప్రధానమైంది నీరు . సహజ సిద్దంగా లభించే ఈ నీటిలోనే అనేక పోషక లవణాలు అందుతాయి. ఆ పోషక లవణాలే మానవ మనుగడకు ఎంతో దోహదపడుతాయి.మన పూర్వీకులు నీటిని బావుల దగ్గర నుండి తీసుకొచ్చి వాడుకునే వారు. ఐతే గత పదిహేనేళ్ళ క్రితం గొట్టపు బావులు,బోరింగుల ద్వారా నీటిని ప్రజలు తీసుకుచ్చి వంటలకు,ఇంటి అవసరాలకు , కాలకృత్యాలకు ఉపయోగించుకుంటూ వచ్చారు . రాను రాను కాలక్రమంగా టెక్నలోజీ అభివృద్ది చెందడంతో ఒక పక్క ప్రభుత్వాలు మిషన్ భగీరథ నీరును ప్రజలకు అందిస్తుంటే , మరో పక్క వ్యాపారులు సైతం కిన్లీ, టాటా, బిసలారీ ,బయిల్లే ,హిమాలయ లాంటి బ్రాండెడ్ కంపనీలు పేరుతో వాటర్ బాటిళ్లను మార్కెట్ లోకి చెలామణి చేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇదే అదునుగా బావించి కొందరూ వ్యాపారస్తులు ఉమ్మడి మెదక్ జిల్లా (సంగారెడ్డి)లో ఆక్వాఫిన కంపనీ వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగిస్తూ లక్షలు గడిస్తున్నారు. సంగారెడ్డి నుండి సిద్దిపేట జిల్లాకు ఈ ఆక్వాఫిన కంపనీ వాటర్ బాటిల్స్ డిస్ట్రీౠట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా డిస్ట్రీౠటర్ దగ్గర నుండి సిద్దిపేట పరిసర ప్రాంతాలతో పాటు ఇతర మండలాలకు ఈ వాటర్ బాటిళ్లు నిత్యం సరఫరా అవుతున్నాయి. జిల్లాలో ఈ కంపనీ బాటిల్స్ పై అనేక ఆరోపణలు ఉన్నా ,విషయం భయటకు రాకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది . తాజాగా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సరఫరా ఈ ఏరియాల్లోనే ..
సిద్దిపేట జిల్లాతో పరిసర మండలాలలో ఈ బాటిళ్లు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , బిర్యానీ సెంటర్లు, కిరాణా షాపులే , వైన్స్, బార్లకు నిత్యం సరఫరా చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రజలు దాహం తీర్చడానికి చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగడం అనేది సర్వసాధారణమైంది. అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా, అనవసర పరిస్థితుల్లో ఈ బాటిల్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని వైద్యులు అంటున్నారు. తాజాగా అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలోని సాయిదర్శిని హోటల్డబిర్యానీ సెంటర్లో ఓ వ్యక్తి దాహం తీర్చుకోవడానికి వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. హోటల్ యజమాని ఆక్వి ఫీన బాటిల్ ఇవ్వగా వినియోగదారుడు ఎమ్మార్వో ఆఫీస్ లో బాటిల్ ఇప్పి వాటర్ తాగగా..నీరు దుర్వాసన,కలుషితం అయినట్లు గమనించిన బయట ఉమ్మి,తనతో పాటు నీరు తాగిన స్నేహితుడికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.
ఆరా తీస్తే..
ఈ విషయం తెలుసుకుని నవతెలంగాణ విలేకరి భాస్కర్ రెడ్డి సాయి దర్శిని హోటల్ నిర్వాహకుడిని ( కేరళ కు చెందిన దయానంద్ ) వాటర్ ఇలా ఉందేంటి అని అడగగా తమకేం సంబంధం లేదని చెప్పాడు. ఎప్పుడూ 5 కేసుల వాటర్
బాటిళ్లను 600 రూపాయలకు కొనుగోలు చేస్తానని సమాధానం చెప్పాడు. వెంటనే డిస్ట్రిబ్యూటర్ ని వివరణ అడగగా తమకేం తెలియదని అనడంతో సిద్దిపేటకు చెందిన డీలర్ సతీశ్ కి ఫోన్ చేసి విషయం వివరించగా... తమకు ఎలాంటి సంబంధం లేదని సంగారెడ్డిలో ఈ కంపెనీ ఉందని, అంత రమణా రెడ్డి కే తెలుసని బదులిచ్చాడు. ఇక్కేడే స్పష్టంగా అర్థమవుతోంది తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నఈ కంపెనీ వాటర్ బాటిళ్లు ఎన్ని చేతులు మారుతున్నాయో, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో ఇక అధికారుల విచారణలో తేలాల్సివుండగా.... ఐతే రమణా రెడ్డి వెనక ఇంకా ఎంతమంది వ్యక్తులు ఉన్నారో బయట పడనుంది.
ఆరోపణలు లేవనడం చర్చనీయాంశం...
ఆక్వాఫిన కంపెనీ బాటిల్స్ పై సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి వరకు 30 కి పైగా ఫిర్యాదులు ఉన్నాయి.ఈ విషయాన్ని నిర్వాహకులు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ వాటర్ బాటిల్స్ జిల్లాలో చర్చనీయాంశం మారింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా హోటళ్లల్లో ఈ కంపెనీ వాటర్ బాటిళ్లు చెలామణి అవుతున్న యజమానులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధిత అధికారులు రైడ్ చేసి ,చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.మరో వైపు ఆ హోటల్లో టాటా వాటర్ బాటిళ్లు ఉన్న ఆక్వాఫిన వాటర్ బాటిల్స్ తక్కువ ధరకు నిర్వాహకులు డంప్ చేసుకుని మరీ విక్రయాలు చేస్తుండడటం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఐతే ఇదే హోటల్ పై గతంలో ఫుడ్ పైన ఆరోపణలు ఉన్నాయంటున్నారు సదరు వ్యక్తులు.
ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిరంతర పర్యవేక్షణ చెయాలి
సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జి.భాస్కర్
నాణ్యత ప్రమాణాలు లేని వాటర్ బాటిల్స్ అమ్ముతూ ప్రజా ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తున్న సాయి దర్శిని హోటల్ పైన చర్యలు తీసుకోవాలి. అలాగే నాసిరకం వాటర్ నీ ఆక్వాఫిన సంస్థ మార్కెట్లోకి చెలామణి చేస్తుంటే అధికారులు పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. ఇలాంటి కంపెనీలను అధికారులు గుర్తించి వెంటనే సీజ్ చేసి ,లైసెన్స్ రద్దు చేయాలి. అక్బరుపేట్ భూంపల్లి మండలంలోని సాయి దర్శినిహోటల్ పై గతంలో అనేక ఆరోపణలున్నాయి.ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి.తద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ఆస్కారం ఉండదు. అధికారులు బాధితుల పక్షాన నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.