Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్యాన్సర్ రోగులకు హైదరాబాద్ నగరంలోనే అందుతున్న కీమోథెరపీ సేవలను జిల్లా కేంద్రంలోనే అందించడమే తమ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ఎలా అయితే అందుతున్నాయో.. క్యాన్సర్ సేవలను కూడా అలాగే అందిస్తామని చెప్పారు. సిద్దిపేట జీజీహెచ్ ఆస్పత్రిలో డే కేర్ కీమోథెరపీ ప్రత్యేక వింగ్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నాలుగు బెడ్స్‌తో ప్రారంభించిన ఈ ప్రత్యేక సేవా విభాగాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే అందుతున్న కీమోథెరపీ సేవలు రాజధాని బయట అందించడం ఇదే ప్రథమమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెగ్యులర్‌గా ఇచ్చే కీమో సేవలు జిల్లాల్లోనే అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. డయాలసిస్ సేవలు ఎలా అందుతున్నాయో.. అలాగే క్యాన్సర్ సేవలు కూడా అందిస్తామని తెలిపారు. మొదటి సైకిల్ ఎంఎన్‌జే, నిమ్స్‌లో ఇస్తారని.. మిగతా సైకిల్ ట్రీట్మెంట్ జిల్లా ఆస్పత్రిలోనే ఇస్తారని చెప్పారు. ప్రతి సైకిల్‌కు పేషెంట్‌కు ఆరు గంటల సమయం పడుతుందన్నారు. ఈ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో సైకిల్‌కు దాదాపు రూ.30వేలు ఖర్చవుతుందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 468 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని.. వీరిలో కొందరికి కీమో థెరపీ అవసరం ఉంటుందని తెలిపారు.