Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను ఎన్నికల అధికారులు తెరిచారు. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్ తాళాలు పగలకొట్టి అందులోని రికార్డులను సేకరించారు. లెక్కింపునకు సంబంధించిన రికార్డులను అధికారులు న్యాయస్థానానికి తరలించారు.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై దాదాపు నాలుగున్నరేళ్లుగా లక్ష్మణ్ పోరాటం చేస్తున్నారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. స్ట్రాంగ్ రూం తెరవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 10న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సమక్షంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేయగా తాళం చెవులు దొరకలేదు. మూడు గదుల్లో రెండోగది తాళం తెరచుకోవడంతో, అందులో పరిశీలించి వీడియో చిత్రీకరించారు. మిగతా రెండు గదుల తాళాలు దొరక్కపోవడంతో మరమ్మతులు చేసే వ్యక్తిని పిలిపించడం లేదా పగలగొట్టాలని భావించారు. ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అంగీకరించలేదు. దీంతో తెరిచిన గదితోపాటు మిగతా రెండు గదులకు అధికారులు సీల్ వేశారు. మూడు స్ట్రాంగ్ రూంలలో కేవలం ఒక గది మాత్రమే తెరుచుకుంది. అందులో 108 నుంచి 269 పోలింగ్ కేంద్రాల ఓటింగ్ యంత్రాలు భద్రంగా ఉన్నాయి. మిగతా రెండు గదుల తాళాలు తెరచుకోలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి నివేదించారు. ఈ క్రమంలో స్పందించిన హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలకొట్టారు.