Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పూంఛ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం వేటను మరింత తీవ్రం చేసింది. ఆర్మీ నార్తన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం స్వయంగా ఉదమ్‌పూర్‌లోని కమాండ్ ఆసుపత్రిని సందర్శించారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుడితో ఆయన మాట్లాడారు. ఇప్పటికే దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా ద్వివేది పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని, దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌ను ఆయన సమీక్షించారు. మరోవైపు ఉగ్రదాడి జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని తూటాలను స్వాధీనం చేసుకొన్నారు. పూంఛ్ - రాజౌరీ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను ఆదివారం ఉదయం నుంచి పునరుద్ధరించారు. ఈ మార్గాన్ని గురువారం నుంచి మూసివేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ మార్గంలోని ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించారు. వెంటనే ఇక్కడ సైనిక ఆపరేషన్ మొదలుపెట్టారు. మొత్తం 14-16 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిలో ఇక్బాల్-ముదిఫా, సలీం దిన్ - రషీదా అనే రెండు జంటలను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ ఘజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్) అనే ఉగ్రసంస్థ చురుగ్గా ఉంది. దాని కమాండర్ రఫీక్ అహ్మద్ అలియాస్ రఫీక్ నాయక్ ఈ ప్రాంతానికి చెందినవాడే. రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో కనీసం మూడు నుంచి నాలుగు ఉగ్రముఠాలు చురుగ్గా పనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.