Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బిజీ వల్ల అలసిపోయిన ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 63 ఏళ్ల కుమారస్వామి శనివారం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. జ్వరం, అలసట, సాధారణ బలహీనత వంటి లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో కుమారస్వామికి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని వెల్లడించింది. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారని తెలిపింది. కుమారస్వామి ఆరోగ్యంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, కర్ణాటకలో మే 10న ఒకే విడుతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో జేడీఎస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కుమారస్వామి తెగ ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకపోవడంతో అలసట వల్ల జ్వరం బారినపడ్డారు. కుమారస్వామికి గతంలో గుండె సంబంధ సర్జరీ జరిగింది.