Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పశ్చిమ గోదావరి
సినిమా తారలపై అభిమానం ఉండొచ్చు... కానీ అది వెర్రితలలు వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. తమ హీరో గొప్పవాడంటే, కాదు తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు కొట్లాటలు జరుగుతుంటాయి. కానీ, హీరోలపై అభిమానం శృతిమించిన ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా హత్యే జరిగింది. జిల్లాలోని అత్తిలికి చెందిన కిశోర్, హరికుమార్ భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిలో హరికుమార్ హీరో ప్రభాస్ కు వీరాభిమాని కాగా, పవన్ కల్యాణ్ కు కిశోర్ భక్తుడు లాంటివాడు.
కాగా, పవన్ కల్యాణ్ వీడియోను కిశోర్ తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. దానిపై హరికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ స్టేటస్ తీసేయాలని కిశోర్ పై ఒత్తిడి చేశాడు. నేనెందుకు మార్చాలి... అంటూ కిశోర్ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి వ్యాఖ్యలు చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన హరికుమార్ అక్కడే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిశోర్ పై దాడి చేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో కిశోర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యోదంతంతో కిశోర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.