Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆసిఫాబాద్: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం ఈదురుగాలుల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పెంచికలపేట మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. కాగజ్నగర్, సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూరు, దహెగాం, చింతలమానేపల్లి, పెంచికల పేట, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూరు మండ లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్వైర్లు తగిలి నాగయ్య, ప్రకాష్ అనే ఇద్దరికి చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. కాగజ్నగర్- సిర్పూర్(టి) ప్రధాన రహదారిపై చెట్లు విరిగి పడడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పెంచికల పేట మండలంలో ఈదురుగాలలతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో భారీవృక్షం నేలకొరిగింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు లేచిపోయాయి. బెజ్జూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి.
జగిత్యాల జిల్లాలోని రెండు మండలాల్లో ఆదివారం స్వల్పంగా వర్షం కురిసింది. కథలాపూర్లో వడగళ్లతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచిపోయింది. సారంగపూర్ మండలంలోనూ స్వల్పంగా వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం, రాత్రి, ఆదివారం ఉదయం కురిసిన అకాల వర్షాలతో 14,620 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాతో ఆదివారం నివేదిక తయారు చేశారు. 13,548 ఎకరాల్లో వరి, 627 ఎకరాల్లో మొక్కజొన్న, 430 ఎకరాల్లో ఇతర పంటలు, 15 ఎకరాల్లో కూరగాయల పంటలకు 33 శాతానికి ఎక్కువగా నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 9,187 రైతులకు సంబంధించిన వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.