Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలు మన దేశ సంస్కృతికి విరుద్ధమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా చెప్పారు. మన దేశ సాంఘిక, మతపరమైన వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని తాము ఈ విధంగా భావిస్తున్నామని చెప్పారు. న్యాయస్థానాలు ఇటువంటి నిర్ణయాలను తీసుకోకూడదని చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు చట్టసభల ప్రక్రియ ద్వారా రావాలన్నారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 15 పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. స్వలింగ వివాహాలకు న్యాయస్థానాల ద్వారా గుర్తింపు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించాలని కోరింది. చట్టసభల ద్వారా మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో బీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఇది సున్నితమైన అంశమని, వైవిద్ధ్యభరితమైన సాంఘిక, మతపరమైన నేపథ్యాలుగలవారు అనేక మంది ఉన్నారని, అందువల్ల దీనిపై విస్తృతమైన సంప్రదింపుల ప్రక్రియ జరగాలని, సమగ్ర చట్టసభల ద్వారా వివిధ సాంఘిక, మతపరమైన వర్గాలను భాగస్వాములను చేసి, వారి అభిప్రాయాలను తీసుకుని, ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.