Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఖమ్మం: నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నిరసనలో భాగంగా నేడు ఖమ్మంలో, ఈ నెల 26న ఆదిలాబాద్ ఈ నెల 28న నల్గొండ, 30న తేదీన మహబూబ్నగర్ వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల నాలుగైదు తేదీల్లో హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుండడంతో తగిన ఏర్పాట్లపై పీసీసీ దృష్టి సారించింది. నిరుద్యోగ నిరసన సభలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.