Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అంటూ పరిచయం చేసుకొని సింగర్ సునీత భర్త, పారిశ్రామిక వేత్త రామకృష్ణ వీరపనేని అలియాస్ రామ్‌ను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం.2లోని ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో నివాసముంటున్న వీరపనేని రామకృష్ణకు గత కొంతకాలంగా కేకే.లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయంపై మాట్లాడాలంటూ కోరాడు.
ఈ తరుణంలో తాను బిజీగా ఉంటానని, ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఉంటే తన ఆఫీసుకు వెళ్లి సిబ్బందిని కలవాలని రామకృష్ణ సూచించాడు. అయితే నేరుగా కలవాల్సిందేనని, పలుమార్లు ఫోన్లు చేయడంతోపాటు వాట్సాప్ మెసేజీలు రావడంతో లక్ష్మణ్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ మరికొన్ని నంబర్లతో ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడం నీకే ప్రమాదమని నీ అంతుచూస్తానని బెదిరించడంతో విసిగిపోయిన వీరపనేని రామకృష్ణ శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడు కేకే.లక్ష్మణ్‌పై ఐపీసీ 506సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.