Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెండ్లి మండపంలో ఓ యువతి వరుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఇంతకీ దాడి చేసిన ఆ యువతి ఎవరనుకున్నారు? మరెవ్వరో కాదు.. పెండ్లి మండపంలో ఉన్న వరుడి మాజీ ప్రియురాలు. తనని మోసం చేసి, మరొకరితో పెండ్లి చేసుకోబోతున్నందుకు తీవ్ర కోపాద్రిక్తురాలైన ఆ యువతి.. ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో వరుడితో వధువు, మరో పది మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటే అమాబల్ గ్రామంలో దముధర్ బాఘేల్ (25) అనే యువకుడికి 19 ఏళ్ల యువతితో పెండ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 19వ తేదీన పెద్దలు వీరి వివాహాన్ని నిశ్చయించారు. చాలా గ్రాండ్‌గా వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ పెండ్లి మండపంలో మొత్తం సందడి వాతావరణం ఉంది. ఇక కొద్దిసేపట్లో పెండ్లి జరగబోతోందనగా.. 22 ఏళ్ల యువతి చేతిలో యాసిడ్ పట్టుకొని, నేరుగా వరుడి వద్దకు వెళ్లింది. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై పోసింది. అదే కోపంలో వధువుపై కూడా యాసిడ్ పోసింది. ఆమెను అడ్డుకోబోయిన వారిపై కూడా యాసిడ్ పోయడంతో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ యువతి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన సాయంత్రం జరగడం, అదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో.. ఈ యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల్ని ఎవ్వరూ గమనించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. వరుడి మాజీ ప్రియురాలైన ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.