Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన ఈ మేరకు సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరం అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చేవేళ్ల సభలో హోంమంత్రి అమిత్షా చెప్పడాన్ని నారాయణ తప్పుపట్టారు. గతంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాల్ని, కులాలను కలుపుకుని పోవాలని కీలక సమావేశాల్లో చెప్పారని నారాయణ గుర్తు చేశారు. అధికారం కోసం పాకులాడే వాళ్ళు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చన్నారు. అలా కాక మతతత్వం రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో సీపీఐ నాయకులు చండ్రరాజేశ్వర్రావు ముస్లింల స్థితిగతులను పరిశీలించినప్పుడు దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారనే తేలిందన్నారు. అంతేకాకుండా సచార్, శ్రీరంగరాజ కమిటీల పరిశీలనలోనూ ముస్లింలు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని నివేదిక ఇచ్చాయని నారాయణ గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఐదు నుంచి నాలుగు శాతానికి రిజర్వేషన్లు తగ్గించారన్నారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.