Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్ సీట్ల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు. రాత్రి 10 గంటల వరకు మాత్రం వాటిని ప్రకటించలేదు. హైదరాబాద్కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.