Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచంలోని కీలక మైదానాలు సచిన్ తెందుల్కర్ పుట్టిన రోజు సంబరాలు చేసుకొంటున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన షార్జా మైదానంలో సచిన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ మైదానంలోని వెస్ట్స్టాండ్స్కు సచిన్ పేరు పెట్టారు. ఇక నుంచి దీనిని ‘సచిన్ తెందుల్కర్ స్టాండ్’గా వ్యవహరించనున్నారు. ఈ స్టాండ్‌కు పేరు పెట్టేందుకు నిన్న అక్కడ ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి సచిన్ 50వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అంతేకాదు 1998లో ఆస్ట్రేలియాపై సచిన్ వరుస శతకాలకు 25 ఏళ్లు పూర్తయిన సంబరాలు కూడా జరిగాయి.
ఈ మైదానంలో స్టాండ్‌కు తన పేరు పెట్టడంపై సచిన్ స్పందిస్తూ.. ‘‘ఈ సందర్భంలో నేను అక్కడ ఉండాలనుకొన్నాను. కానీ, ముందుగానే అంగీకరించిన కొన్ని పనులు ఉండటంతో రాలేకపోయాను. షార్జాలో ఆడటం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ ప్రేమాభిమానాలు లభిస్తాయి. భారత, ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు షార్జా ఎప్పటికీ చాలా ప్రత్యేకమైంది. నా 50 పుట్టిన రోజుకు, డిజర్ట్స్ట్రామ్ ఇన్నింగ్స్ 25వ వార్షికోత్సవానికి గుర్తుగా కార్యక్రమం ఏర్పాటుచేయటంపై బుఖాతీర్, ఆయన బృందానికి చాలా కృతజ్ఞతలు’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా షార్జా మైదానం సీఈవో ఖలాఫ్ బుఖాతీర్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆటకు సచిన్ చేసిన దానికి మేము చెప్పిన చిన్న కృతజ్ఞత ఇది అని పేర్కొన్నారు.
1998 కోకకోలా కప్‌లో భాగంగా ఏప్రిల్ 22న సచిన్ 143 పరుగులు సాధించగా.. ఆ తర్వాత రెండు రోజులకు సిరీస్ ఫైనల్స్‌లో 134 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లు కిక్రెట్ పుస్తకాల్లో ‘ఇసుక తుపాన్లు’గా ప్రసిద్ధి చెందాయి. ఈ శతకాలను సచిన్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోని విషయం తెలిసిందే. సచిన్ వన్డేల్లో చేసిన 49 శతకాల్లో ఏడింటికి షార్జా క్రికెట్ మైదానం వేదికైంది. ఈ మైదానంలో మొత్తం 244 అంతర్జాతీయ వన్డేలు జరిగాయి. ఇది గిన్నిస్ రికార్డు. వీటిల్లో క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇక, నిన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఓ గేటుకు కూడా సచిన్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.